Saturday, January 25, 2014

వియద్గంగ - 2

ఈ కథ, డాక్టర్ కశ్యప్, మందాకిని రాక కోసం ఎదురు చూస్తుండడంతో మొదలవుతుంది. ఈ మందాకిని ఎవరంటే, కశ్యప్ ప్రాణప్రదంగా పెంచుకుని, తన ఆప్తమిత్రుడు రాజా కి ఇచ్చి పెళ్లి చేసిన, చెల్లెలు రాణి సంసారాన్ని కూలదోస్తున్న మహాతల్లి (ఆ చెల్లి మాటల్లో). ఇటువంటి పరిస్థితిలో కూడా, కశ్యప్ తన చెల్లి వైపునుండి మాత్రమే కాక, ఆ ఇంకో మనిషిని కూడా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే ఆమె వైజాగ్ కి కాంప్ కి వచ్చిందని తెలిసి, డిన్నర్ కి ఆహ్వానిస్తాడు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మందాకినిని గురించి అతను అనుకునే మాట "రాగఛ్చాయల్లో ఇమడని ఆలాపన ఆమె". 

     ఆ రోజు జరిగిన సంభాషణలో కశ్యప్ గమనించే విషయం "ఫలితం ఏదన్నా కావచ్చు... ఆమె సాన్నిధ్యం గొప్ప అనుభవం" అని. అతను భోంచేయకపోడం గమనించిన ఆమె, కారణం అడిగినప్పుడు "జీవితంలో మనకు ఇష్టమైన దాన్ని ముడుపు కట్టుకొని, మనం కోరుకున్న వ్యక్తికి మేలుగా మార్చగలం" అన్న థియరీ ని తను నమ్ముతానని, అందుకే తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు, తన ప్రాణ మిత్రుడైన రాజా హాయిగా ఉండాలని కోరుకుంటూ, తనకు చాలా ఇష్టమైన తిండిని దూరం చేసుకున్నానని చెప్తాడు. 

       ఆ ఒక్కరోజు పరిచయంలో కశ్యప్ మాటల్లో, మౌనంలో మందాకిని నేర్చుకున్న విషయాలు ఆమె , ఆమెను భూమిపై ప్రవహించే మందాకిని నుండి, ఆకాశంలో ఉండే వియద్గంగగా మారడానికి దోహదం చేస్తాయి. 

    నేను ఈ పుస్తకం మొదటిసారి చదివేటప్పటికి, ఇందులో ఉన్న మిగతా కథలు, రచయితల గురించి ఏ మాత్రం తెలీదు. కాబట్టి అన్ని కథలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చదివాను. అమ్మ ప్రతిదానికీ ఉపవాసం అంటే విసుక్కునే దాన్ని... అలా లంచాలు ఇస్తారా దేవుడి కి, మనం అన్నం మానేస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి అని. కానీ ఈ కథ చదివిన తర్వాత అర్థం అయ్యింది, మనుషులుగా మనకు అత్యంత పెద్ద బలహీనత అయిన, లేదా మనకు అతి ఇష్టమైన ఏదో ఒక విషయాన్ని, అవతల మనిషికి మంచి జరగాలని నిస్వార్థంగా త్యాగం చేస్తే , ఆ ప్రేమపూరిత చర్య ఆ మనిషి జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసి తీరుతుందని. 

      రచయిత డా. వి. ఆర్. రాసాని గారి మాటల్లో "... జీవితాన్ని జీవిస్తూ మన జీవితానికి మనమే ప్రేక్షక పాత్ర వహిస్తూ సన్నివేశాలను, ఫలితాలను, అనుభూతులను సమీక్షించుకుంటూ బ్రతకడం వలన చాలా సమస్యలకు అర్థాలు దొరుకుతాయి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ విషయాన్ని కథారూపంలో జలంధరగారు చక్కగా అందించారు."

    ఈ పుస్తకంలో మీరిదివరకే చదివి ఉండిన కథలు గాలివాన, మధుర మీనాక్షి, ఓ పువ్వు పూసింది,భగవంతం కోసం లాంటి కథలతో పాటు, అరుదైన హొగినేకల్, పెంజీకటి కవ్వల,ఒక గంట జీవితం, నా స్నేహితుడు... లాంటి మంచి కథలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఇదివరకు చదివి ఉండకపోతే ఈసారి పుస్తకాల షాప్ కి వెళ్ళినప్పుడు తప్పక తెచ్చుకోండి. మీరు డిజప్పాయింట్ అవ్వరని నా నమ్మకం. 
 
                               తాత్త్విక కథలు
                            సుభాషిణి ప్రచురణలు
                                వెల:  150/రూ . 
         దొరికే చోటు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ &  ప్రజాశక్తి బుక్ డిపో
                   
              ఇంకా ఈ పుస్తకంలో ఉన్న మిగతా కథలు... 

            






                                         
                

No comments:

Post a Comment