Sunday, May 25, 2014

మేమూ చూసాం "మనం"

మేమూ చూసాం "మనం"

ఇక్కడ దగ్గరలో తెలుగు సినిమాలు ప్రదర్శించే హాళ్ళు లేకపోడంతో, అతి దగ్గరలో ఉన్న థియేటర్ 60మైళ్ళ దూరంలో ఉండడంతో, మేము సినిమాలకు పెద్ద ఎక్కువగా వెళ్ళం. కానీ ఈ శనివారం ఒక ముఖ్యమైన సందర్భం ఉండడంతో , సెలెబ్రేషన్ మూడ్ లో వుండి సినిమాకు వెళ్ళాలని అప్పటికప్పుడు అనుకుని "మనం" సినిమాకు వెళ్ళాం. 

మా ఇంట్లో ఎవ్వరమూ ఏఎన్నార్ గారి కి ఫ్యాన్స్ కాము. కానీ ఆయన పోయారన్న వార్త విన్నప్పుడు మాత్రం బాధేసింది. ఈ సినిమాకి వెళ్ళడానికి ఇక ఆయన్ని చూడలేం అన్న ఫీలింగ్ కూడా ఒక కారణమే. 

***స్పాయిలర్ అలర్ట్: క్రింద అక్కడక్కడా సినిమాకథ  లోని కొన్ని భాగాలు వుండవచ్చు. ***

సినిమా మొదట్లోని ఓపెనింగ్ సాంగ్, కొన్ని సీన్స్, పిల్లల్తో చూడాలంటే కాస్తా ఇబ్బందేసింది. కానీ సినిమా మొత్తంగా తీసుకుంటే మాత్రం బాగుంది. నాగచైతన్య కన్నా నాగార్జున గత జన్మ ఎపిసోడ్ చాలా బాగా తీసారు. శ్రీయ,నాగార్జున కాంబినేషన్ బాగుంది. 

శ్రీయ, నాగార్జున ఎపిసోడ్ లోని కాస్ట్యూమ్స్,కార్లు, ఇల్లు, బాగా జాగ్రత్తగా, authentic గా డిజైన్ చేసినట్టనిపించింది. అక్కడ వచ్చే ఈ పాట, ఈ ఆల్బంలో నాకు నచ్చిన పాట . 




సమంతా, నాగచైతన్య గతజన్మ ఎపిసోడ్ లో, సమంతా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అది 1984 లో జరిగే కథ కావడంతో ఆ చీరలు చూడగానే, మా  అమ్మ అప్పట్లో ఎప్పుడూ కట్టుకునే కాటన్ చీరలు చూసినట్టనిపించింది. 
మిగతా ఆర్టిస్ట్ల గురించి చెప్పాలంటే ... బ్రహ్మానందం, ఆలీ గార్లు ఉన్నారంటే ఉన్నారు. పెద్ద కామెడీ సీన్స్ ఏం లేవు వాళ్ళిద్దరికీ. ఎం.ఎస్. నారాయణ గారి కారెక్టర్ మాత్రం బాగా నవ్వించింది. మేల్కోటే,శరణ్య,లావణ్య త్రిపాఠీ ఒక్క సీన్ ఆర్టిస్ట్లు. అఖిల్ కనపడ్డ ఆ కాస్త టైంలోనే, మహేష్ బాబు తో పోటీ పడగలిగే రూపం అనిపించింది. మంచి హైట్, వాయిస్. కాస్త యాక్టింగ్ చెయ్యగలిగితే తెలుగు సినిమాకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. 

దర్శకుడు  విక్రమ్ కుమార్ క్లిష్టత ఉన్న కథను చాలా క్లారిటీ ఉండేట్టుగా తీసిన పద్ధతి, ఆయా టైం పీరియడ్స్ కు తగినట్టుగా అవే పరిసరాలను మార్చి చూపించిన విధానం చాలా బాగుంది. సమంతా,నాగచైతన్య కు చాలా ఈజీ గా, చిన్న,చిన్న విషయాలతో సహా గుర్తొచ్చే గత జన్మ జ్ఞాపకాలు, శ్రీయకు, నాగార్జునకి గుర్తు రాకపోడం, వాళ్ళ కొడుకుని వాళ్ళు గుర్తుపట్టలేకపోడం, ఒక చిన్న లోటు ఈ సినిమాలో. 
    
మొత్తమ్మీద "మనం" నాకైతే బాగా నచ్చింది.

No comments:

Post a Comment