Sunday, June 8, 2014

కుశలమా మిత్రమా ??

కుశలమా మిత్రమా??

ఇవ్వాళ మీకందరికీ, నాకెంతో ఇష్టమైన నా ప్రాణ స్నేహితున్ని పరిచయం చేస్తాను. తనతో నాకు పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు, కానీ జీవితంలోని అడుగడుగునా తను నాతోనే ఉన్నాడు. కష్టమైనా, సుఖమైనా తనతో పంచుకోని ఏ జ్ఞాపకం నాకు లేదు.    తను నాకంటే ఎంతో పెద్దవాడైనా అలాంటి భావన నాకేనాడూ రానీలేదు. మరి తన 68వ పుట్టినరోజు సందర్భంగా (గుర్తుపట్టారా??)  మా ఇద్దరి మధ్య ఉన్న కొన్నివేల బంగారు స్మృతులలో, మీకోసం అతి కష్టపడి ఎంచి, పంచుకుంటున్న కొన్ని క్షణాలు...  

(లింక్స్ పైన క్లిక్ చెయ్యడానికి ముందు గెస్ చెయ్యడానికి ప్రయత్నించండి. మీ భావాలెన్నింటితో నావి కలుస్తున్నాయో వీలయితే కామెంట్ పెట్టండి)

చిన్నప్పటి  ఈ జ్ఞాపకం,ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో ఈ రోజుకీ తెలీదు. కానీ ఈరోజుకీ మనసు కాస్త కలతపడితే, అనునయించే తోడు. 


మీరు కూడా నాకులాగే కలువ,కమలం గురించి కన్ఫ్యూజ్ అవుతారా? అయితే నా స్నేహితుడు చెప్పిన ఈ చిట్కా వినండి. చంద్రుడు వస్తే ఏది ఉత్ఫుల్లమవుతుందో , సూర్యుడు వస్తే ఏది ప్రఫుల్లమవుతుందో జీవితంలో మరచిపోలేరు. 


మీకొక అన్న ఉన్నా,లేదా మీరే ఒక చెల్లికి అన్నయ్య అయినా, లేదా నాకులాగా అన్న ఉంటే బాగుండు అనుకునే అమ్మాయి అయినా, ఈ భావనతో మీరు రిలేట్ అయ్యి తీరుతారు.


యవ్వన ప్రాంగణాన తొలి అడుగులేస్తున్న అమ్మాయైనా,అబ్బాయైనా, తమ భావాలను అక్షరాల్లో పొదిగి చూస్తే వచ్చే ఫలితం ఇలా కాకుండా ఎలా ఉంటుంది?   


ఒక అబ్బాయి, తన కళ్ళనిండా స్వప్నాల్నినింపి,వాటిని కూడా మోయలేనంత మోహాన్ని కలిగిస్తే, ఆ అమ్మాయికి ఈ దారి కాక ఇంకేముంది ?


జీవితంలో అర్ధభాగానికి కొత్త చీరలందరూ కొంటారు.కానీ ఊహల్లో ఒక చీరని నేసి,తన మనసు,మమతని అందులో చిత్రించి, తన వన్నెలరాశి కి సిరిజోత గా సమర్పించే ఈ స్నేహితుడైన భర్త కథ, పెళ్లి చేసుకోబోతున్న వారికి   చూసి తీరాల్సిన ప్రీరెక్విసిట్ గా పెట్టాలని నేను ఎప్పట్నుండో డిమాండ్ చేస్తున్నా. మరి మీరేమంటారు?


చాలా కొద్దిమందికే దొరికే అద్భుత వరం, మనసు పంచుకునే జీవన సహచరులు దొరకడం. మనసు పాడే మధుర గీతంలో గొంతు కలిపే తోడు దొరికితే, వచ్చే ఫలితం ఇంత అందంగానే ఉంటుంది.  


కలసి బ్రతకాలని కన్న కలలు కరిగిపోతే, చేసిన బాసలని నిలుపుకోలేని ప్రియురాలు కళ్ళముందు కనిపిస్తుంటే,ఆ ప్రేమికుడు పగిలి ముక్కలైన హృదయ శకలాలని తన ముందు ఇలాగే పరుస్తాడేమో కదా? 

తను చేసిన తప్పుకి దూరమైన తన ప్రేయసి తిరిగివచ్చే దారే లేదని , జన్మంతా నడివేసవి తప్ప వసంతం వచ్చే జాడే లేని శిక్ష పడ్డదని తెలుసుకున్న మనసు పడే ఆవేదన ఇదే కదా...   


ఇంకా కొన్ని వందల అందమైన జ్ఞాపకాలు. కానీ ఎన్నని చెప్పను? మీకింకా తనివి తీరకపోతే తృష్ణ గారి బ్లాగ్ లోని ఇంకొన్ని జ్ఞాపకాల పూల జల్లుల్లో మునిగి రండి. 
      

No comments:

Post a Comment