Sunday, June 15, 2014

క్షణ, క్షణం...భయం,భయం

క్షణ, క్షణం...భయం,భయం 

స్కూల్ కో, కాలేజీకో అని వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగొస్తారో, లేదో అని భయం... 

రావడం అరగంట ఆలస్యమైతే ఇక చూడగలమో లేదో అన్న భయం... 

ఫ్రెండ్స్ తో పార్టీకో,సినిమాకో వెళ్ళిన పిల్లలు ఆ ఫ్రెండ్స్ చేతిలోనే యే ఘోరానికైనా గురవుతారేమోనని భయం... 

టూర్లకో,పిక్నిక్కులకో వెళ్ళిన పిల్లలు ఎక్కడ, ఏ ప్రమాదాల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో అని భయం... 
  
ప్రొద్దున పేపర్ తెరిస్తే చదివే,టీవీ లో 24 గంటలు వినే, ఘోరమైన వార్తల్లాంటి సంఘటనలు మన పిల్లలకెక్కడ జరుగుతాయో అని భయం...  

అమ్మానాన్నలు, అన్నం, నీళ్ళతో కాదు,అనుక్షణం ఈ భయాలతో, అనుమానాలతో,చస్తూ బతుకుతున్నారు. ఒకట్రెండు తరాల క్రితం వరకూ లేని ఈ పరిస్థితులు, ఇప్పుడు సర్వసాధారణమైపోడానికి కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు, కర్ణుడి చావుకు కారణాలు లక్ష లాగా. 

ఇలాంటి ఒక సంఘటనని చాలా సింపుల్ గా,సూటిగా చెప్పిన కథ పి.సత్యవతి గారి "పిల్లాడొస్తాడా" కథ. రచయిత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపున్న సత్యవతిగారు నాకిష్టమైన రచయిత్రుల్లో ఒకరు. ఈ కథ కూడా ఆవిడకలవాటైన, అందరూ అది మామూలే అన్న విషయాన్ని కొత్త కోణంలో చూపుతూ, బాగా చదివించే శైలిలో రాసిన మంచి కథ. 

ఈ కథ ముగింపు కథకి హైలైట్. కథ మొత్తంలో జరిగేలాగే, ముగింపులోనూ కథలోని రెండు ముఖ్యపాత్రల్లో ఒక పాత్ర ఆశావహ దృక్పథం తోనూ,మరొక పాత్ర నెగటివ్ ఆలోచనతోనూ అనే మాటలతో ముగించడం చాలా సరియైన ముగింపులా అనిపించింది. 

ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్ లోని ఈ కథ తప్పక చదవండి. 

మనందరికీ అతి సాధారణమైపోయిన విషయం, ఒక మంచి రచయిత/త్రి చేతిలో పడితే, అది మరొకసారి కొత్తగా మనసుని తాకే కథ ఎలా అవుతుందో చూడండి.

ఈ కథ చదివి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుంటారు కదూ...


No comments:

Post a Comment