Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Sunday, June 15, 2014

క్షణ, క్షణం...భయం,భయం

క్షణ, క్షణం...భయం,భయం 

స్కూల్ కో, కాలేజీకో అని వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగొస్తారో, లేదో అని భయం... 

రావడం అరగంట ఆలస్యమైతే ఇక చూడగలమో లేదో అన్న భయం... 

ఫ్రెండ్స్ తో పార్టీకో,సినిమాకో వెళ్ళిన పిల్లలు ఆ ఫ్రెండ్స్ చేతిలోనే యే ఘోరానికైనా గురవుతారేమోనని భయం... 

టూర్లకో,పిక్నిక్కులకో వెళ్ళిన పిల్లలు ఎక్కడ, ఏ ప్రమాదాల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో అని భయం... 
  
ప్రొద్దున పేపర్ తెరిస్తే చదివే,టీవీ లో 24 గంటలు వినే, ఘోరమైన వార్తల్లాంటి సంఘటనలు మన పిల్లలకెక్కడ జరుగుతాయో అని భయం...  

అమ్మానాన్నలు, అన్నం, నీళ్ళతో కాదు,అనుక్షణం ఈ భయాలతో, అనుమానాలతో,చస్తూ బతుకుతున్నారు. ఒకట్రెండు తరాల క్రితం వరకూ లేని ఈ పరిస్థితులు, ఇప్పుడు సర్వసాధారణమైపోడానికి కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు, కర్ణుడి చావుకు కారణాలు లక్ష లాగా. 

ఇలాంటి ఒక సంఘటనని చాలా సింపుల్ గా,సూటిగా చెప్పిన కథ పి.సత్యవతి గారి "పిల్లాడొస్తాడా" కథ. రచయిత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపున్న సత్యవతిగారు నాకిష్టమైన రచయిత్రుల్లో ఒకరు. ఈ కథ కూడా ఆవిడకలవాటైన, అందరూ అది మామూలే అన్న విషయాన్ని కొత్త కోణంలో చూపుతూ, బాగా చదివించే శైలిలో రాసిన మంచి కథ. 

ఈ కథ ముగింపు కథకి హైలైట్. కథ మొత్తంలో జరిగేలాగే, ముగింపులోనూ కథలోని రెండు ముఖ్యపాత్రల్లో ఒక పాత్ర ఆశావహ దృక్పథం తోనూ,మరొక పాత్ర నెగటివ్ ఆలోచనతోనూ అనే మాటలతో ముగించడం చాలా సరియైన ముగింపులా అనిపించింది. 

ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్ లోని ఈ కథ తప్పక చదవండి. 

మనందరికీ అతి సాధారణమైపోయిన విషయం, ఒక మంచి రచయిత/త్రి చేతిలో పడితే, అది మరొకసారి కొత్తగా మనసుని తాకే కథ ఎలా అవుతుందో చూడండి.

ఈ కథ చదివి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుంటారు కదూ...


Saturday, March 15, 2014

ఈ కథ చదివారా ?

ఈ కథ చదివారా ?

ఈ వారం చదివిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ... 
రమాసుందరి గారి "నమూనా బొమ్మ" కథ. 

మనలో చాలామందిలో ఉండే ఒక మామూలు లక్షణం, బలహీనులు, ఓడిపోయినవాళ్ళు, భరించలేని దుః ఖాలని మోస్తున్న వాళ్ళ పైన , పైసా ఖర్చులేని సానుభూతి ఒలకబొయ్యడం. ఆ సానుభూతి అందుకునే వ్యక్తి, ఏదైనా ప్రయత్నంతో తన బాధనుండి బయటపడాలనో, ఒక కొత్త జీవితాన్ని పునర్మించుకోవాలనో చూస్తే, ఈ సానుభూతి ఒలకబోసినవాళ్లు, కాసింత చేయూతనివ్వరు సరికదా వినేవాళ్ళుంటే   విమర్శించగలరు కూడా. మనసులోని ఈ చీకటి కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ ఇది. 

బాధలో ఉన్నవాళ్ళ పైన మనకు ఉండేది సానుభూతి మాత్రమే, ప్రేమ కాదు. సానుభూతి, దయ, బాధ్యత లేని ఫీలింగ్స్ , కాని ప్రేమ అలా కాదు. కొద్దికాలానికి ఈ సానుభూతి అందుకోడం కూడా ఒక వ్యసనంలా మారిపోయి,ఆ వ్యక్తి తనున్న పరిస్థుతులను ఏమైనా మార్చుకోవచ్చా అని ఆలోచించడం కూడా మానేస్తారు. ఉదాహరణకి మా బంధువుల్లో ఒకామెకి ప్రతి వారం ఏదో ఒక పేద్ద జబ్బు వస్తూనే ఉంటుంది. ఎంత మంది డాక్టర్లు ఎన్ని రకాల టెస్ట్లు చేసి "నీకేం లేదమ్మా" అని చెప్పినా ఆవిడ వినదు. ఆమెకి ఆ వంక పెట్టుకుని బంధువులందరికీ ఫోన్లు చెయ్యడం, వాళ్ళు ఆవిడని "అయ్యో పాపం, ఇంత మంచిదానివి..నీకే ఇన్ని కష్టాలా" అని జాలి పడ్డం, ఊర్లో ఉన్నవాళ్ళు ఆవిడని ఇంటికి వచ్చి పరామర్శించడం, చాలా ఇష్టమైన విషయాలు. 

ఈ కథలో భరించలేని దుఃఖం కలిగిన మల్లీశ్వరికి, ప్రధాన పాత్ర లీల తన సానుభూతిని, ఓదార్పుని, అందించగలిగే "ఉన్నత"స్థితిలో ఉన్నంతవరకు మంచిగానే ఆలోచించగలిగింది. కానీ ఎప్పుడైతే మల్లీశ్వరి తన చెదిరిపోయిన జీవితాన్ని,కాస్త, కాస్తగా సవరించుకోవాలనుకుందో, అది లీలకి భరించలేని విషయంగా మారింది. రమాసుందరి గారు చాలా స్పష్టంగా, సూటిగా, ఆసక్తికరమైన శైలిలో రాసిన ఈ కథ ఈ వారం నేను చదివిన కథల్లో బెస్ట్ కథ. 

మరి చదివి మీకేమనిపించిందో షేర్ చేసుకోండి.