Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

Saturday, June 28, 2014

మీరేమంటారు ??

మీరేమంటారు ?

అమెరికాలో వెస్ట్ కోస్ట్ లో ఉన్నవారైనా, లేదా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాళ్ళని చూడడానికి వచ్చినా, చూసి తీరే ఒక ప్రదేశం శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్



 File:GoldenGateBridge.jpg


Image from:http://en.wikipedia.org/wiki/File:GoldenGateBridge.jpg



    కొన్నిసార్లు పొగమంచు మేలిముసుగులో ఉండి, అంతదూరం నుండి వచ్చిన వాళ్ళకి ఒక చూపైనా దక్కనీయక పంపితే... 

     మరి కొన్నిసార్లు మబ్బుల్లో తేలుతున్నట్లు కనిపించి, కిందున్న నీలి సముద్రంలోనుండి, పైనున్న నీలాకాశానికి వేసిన వంతెనలా, ఉందో లేదో తెలీని మరో లోకానికి మనల్ని తీసుకెళ్ళే దారి ఇదేనేమో అనిపిస్తుంది. 



Photograph:Fog enshrouds the Golden Gate Bridge, which spans the entrance to San Francisco Bay in California.



      బహుశా ఈ రెండో కారణం వల్లేనేమో, యేటా ఆ బ్రిడ్జ్ పైనుండి దూకి ఎందరో ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ ఆత్మహత్యలను ఆపడానికి, తమవాళ్ళని కోల్పోయిన కొంతమంది ఆ బ్రిడ్జ్ కి ఒక నెట్ ఏర్పాటు చెయ్యాలని 20-30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ప్రొద్దున న్యూస్ లో $76 మిలియన్లు ఖర్చయ్యే ఆ ప్రతిపాదనని బోర్డ్ అంగీకరించిందని చదివాను. 

http://www.sfgate.com/bayarea/article/Golden-Gate-Bridge-going-to-get-suicide-nets-5585482.php

  అది చదివిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. తమవాళ్ళని ఆత్మహత్యతో కోల్పోయిన వారి మానసిక స్థితిని అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఆ పరిస్థితి వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరి వాళ్ళకు వచ్చింది కాబట్టి. మనమేమైనా చేసి ఉండగలిగేవాళ్ళమా? లేదా వాళ్ళ మానసిక స్థితిని అంచనా వెయ్యలేక పొరపాటు చేసామా అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ వదలదు. 

      కానీ ఈ నెట్ ఏర్పాటు చెయ్యడం ఆత్మహత్యలని నిరోధించడానికి ఎలాంటి పరిష్కారమో నాకర్థం కాలేదు. 

    ఈ ప్రతిపాదనని సమర్థించే వారు,అమెరికాలోని ఏ ఇతర బ్రిడ్జ్ ల కంటే గోల్డెన్ గేట్ బ్రిడ్డ్జ్ పై ఆత్మహత్య ఎక్కువమంది చేసుకుంటారు అని స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వీలవ్వకపోతే, మరణించాలనుకునే వారు మరో దారి వెతుక్కోరనే నమ్మకమేముంది? ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నంనుండి వెనక్కి తిరిగినవారు,మళ్ళీ ఆ ప్రయత్నం చెయ్యరు అని చెప్తున్నారు. కానీ ఆ స్టాటిస్టిక్స్ ఎలా తయారు చేస్తారో నాకర్థం కాలేదు. ఎంతమంది ప్రయత్నించి వెనుతిరిగారో ఎలా తెలుస్తుంది,వాళ్ళే చెపితే తప్ప. 

   ఇలాంటి ఎన్నో వ్యతిరేకతలని పరిశీలించిన తర్వాతే ఆ ప్రతిపాదనని అంగీకరించి ఉంటారని తెలుసు. కానీ నాకు మాత్రం ఇది సబబైన నిర్ణయంలా అనిపించలేదు. 

మరి ఇది చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది ??? 



Saturday, April 5, 2014

మంచు పైన మెరుపు తీగ

మంచు పై మెరుపు తీ 
సోచీ వింటర్ ఒలంపిక్స్ చూసారా? మీరు చూసినా, చూడకపోయినా, ఈ ఫిగర్ స్కేటర్ గురించైతే వినే ఉంటారు. ఆ గేమ్స్ లో రెండు కాంపిటీషన్లలో పాల్గొని, మూడో ఈవెంట్లో పాల్గొనబోతూ లాస్ట్ మినిట్లో నేను రిటైర్ అవుతున్నా అని చెప్పి, వార్తల్లో ప్రముఖంగా నిలచిన ఫిగర్ స్కేటర్ ఎవ్గీనీ ప్లుషేంకో గుర్తున్నాడా ? 

తన గురించి చదువుతుంటే, తన పట్టుదల, తన కోచ్ పైన తనకున్న గౌరవం, దేశం పైన ప్రేమ...భలే నచ్చేసాడు.




 (14 యేళ్ళ వయసులో యంగెస్ట్ ఎవర్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్ పెర్ఫార్మన్స్)

ప్లుషేంకో 11 యేళ్ళ వయసులో కోచ్ మిషిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోడం మొదలెట్టాడు. తనతో పాటూ అదే కోచ్ దగ్గర ట్రైన్ అవుతూ, మధ్యలో వేరే కోచ్ దగ్గరకి వెళ్ళిపోయిన అలెక్సీ యాగుడిన్ తో తనకు బద్ధ విరోధముండేది. అలెక్సీ రిటైర్ అయ్యేవరకు ఆ శతృత్వం అలాగే కొనసాగింది. ఎన్నో ఛాంపియన్ షిప్స్ గెలుచుకున్న అలెక్సీ , ప్లుషేంకో కారణంగా, రష్యన్ నేషనల్ ఛాంపియన్ షిప్ మాత్రం ఒక్కసారి కూడా సంపాదించలేకపోయాడు. 

 2006 లో తను బ్రేక్ తీసుకున్నప్పుడు, తర్వాత సంవత్సరం (2007) వరల్డ్ చాంపియన్ షిప్ లో రష్యా పెర్ఫార్మెన్స్ చూసి బాధపడి, రాబోయే 2010 ఒలంపిక్స్ లో మళ్ళీ రష్యా ని ఛాంపియన్ గా నిలబెట్టాలనుకున్నాడు. 



పట్టుదలతో తన ట్రైనింగ్ మళ్ళీ మొదలుపెట్టి, వాంకోవర్  ఒలంపిక్స్ లో తన షార్ట్ ప్రోగ్రాం పెర్ఫార్మెన్స్ స్కోర్ తో అప్పటిదాకా ఉన్న రికార్డ్ బ్రేక్ చేసాడు. కానీ గాయాల కారణంగా 2010 వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనలేకపోయాడు. అదే సంవత్సరం తను స్కేటింగ్ ఎక్జిబిషన్స్లో అనుమతి లేకుండా పాల్గొనడం వల్ల ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ నిషేధానికి గురయ్యాడు. కానీ అదే సంస్థ తను తిరిగి 2014 ఒలంపిక్స్ లో పాల్గొనడానికి అనుమతి కోరినప్పుడు, ఏకగ్రీవంగా అంగీకరించింది. 


  
సోచీ ఒలంపిక్స్ లో రష్యా కి మొదటి గోల్డ్ మెడల్ (టీమ్) సాధించి, తన బాక్ ఇంజ్యురీ కారణంగా మిగిలిన పోటీలనుండి తప్పుకొని రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.  



కానీ తనని 2018 వింటర్ ఒలంపిక్స్ లో మళ్ళీ చూస్తే, ఏ మాత్రం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే తన సంకల్ప బలం అలాంటిది కాబట్టి... అతను ఇప్పటికెన్నో సార్లు పడి, లేచిన కడలి తరంగం కాబట్టి. 
   

(దొంగలు పడ్డ ఆరు నెలలకు సామెతలాగా ఎప్పుడో ముగిసిపోయిన వింటర్ ఒలంపిక్స్ కి సంబంధించిన పోస్ట్ ఇప్పుడేంటి అనుకోకండి. ఇది అప్పట్నుండి నా డ్రాఫ్ట్స్ లో మూలుగుతూనే ఉంది.)

Saturday, March 15, 2014

ఈ కథ చదివారా ?

ఈ కథ చదివారా ?

ఈ వారం చదివిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ... 
రమాసుందరి గారి "నమూనా బొమ్మ" కథ. 

మనలో చాలామందిలో ఉండే ఒక మామూలు లక్షణం, బలహీనులు, ఓడిపోయినవాళ్ళు, భరించలేని దుః ఖాలని మోస్తున్న వాళ్ళ పైన , పైసా ఖర్చులేని సానుభూతి ఒలకబొయ్యడం. ఆ సానుభూతి అందుకునే వ్యక్తి, ఏదైనా ప్రయత్నంతో తన బాధనుండి బయటపడాలనో, ఒక కొత్త జీవితాన్ని పునర్మించుకోవాలనో చూస్తే, ఈ సానుభూతి ఒలకబోసినవాళ్లు, కాసింత చేయూతనివ్వరు సరికదా వినేవాళ్ళుంటే   విమర్శించగలరు కూడా. మనసులోని ఈ చీకటి కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ ఇది. 

బాధలో ఉన్నవాళ్ళ పైన మనకు ఉండేది సానుభూతి మాత్రమే, ప్రేమ కాదు. సానుభూతి, దయ, బాధ్యత లేని ఫీలింగ్స్ , కాని ప్రేమ అలా కాదు. కొద్దికాలానికి ఈ సానుభూతి అందుకోడం కూడా ఒక వ్యసనంలా మారిపోయి,ఆ వ్యక్తి తనున్న పరిస్థుతులను ఏమైనా మార్చుకోవచ్చా అని ఆలోచించడం కూడా మానేస్తారు. ఉదాహరణకి మా బంధువుల్లో ఒకామెకి ప్రతి వారం ఏదో ఒక పేద్ద జబ్బు వస్తూనే ఉంటుంది. ఎంత మంది డాక్టర్లు ఎన్ని రకాల టెస్ట్లు చేసి "నీకేం లేదమ్మా" అని చెప్పినా ఆవిడ వినదు. ఆమెకి ఆ వంక పెట్టుకుని బంధువులందరికీ ఫోన్లు చెయ్యడం, వాళ్ళు ఆవిడని "అయ్యో పాపం, ఇంత మంచిదానివి..నీకే ఇన్ని కష్టాలా" అని జాలి పడ్డం, ఊర్లో ఉన్నవాళ్ళు ఆవిడని ఇంటికి వచ్చి పరామర్శించడం, చాలా ఇష్టమైన విషయాలు. 

ఈ కథలో భరించలేని దుఃఖం కలిగిన మల్లీశ్వరికి, ప్రధాన పాత్ర లీల తన సానుభూతిని, ఓదార్పుని, అందించగలిగే "ఉన్నత"స్థితిలో ఉన్నంతవరకు మంచిగానే ఆలోచించగలిగింది. కానీ ఎప్పుడైతే మల్లీశ్వరి తన చెదిరిపోయిన జీవితాన్ని,కాస్త, కాస్తగా సవరించుకోవాలనుకుందో, అది లీలకి భరించలేని విషయంగా మారింది. రమాసుందరి గారు చాలా స్పష్టంగా, సూటిగా, ఆసక్తికరమైన శైలిలో రాసిన ఈ కథ ఈ వారం నేను చదివిన కథల్లో బెస్ట్ కథ. 

మరి చదివి మీకేమనిపించిందో షేర్ చేసుకోండి.  


Friday, March 7, 2014

ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట

ఈ రోజు మరీ, మరీ గుర్తొస్తున్న పాట

ఎందుకో కదూ, కొన్నిసార్లు ఏదో పాట మనసుని సడన్ గా కలవరపెట్టేస్తుంది. మన మానాన మనం రోజువారీ రొడ్డకొట్టుడులో బిజీ, బిజీగా ఉంటామా ? ఓ పాటేదో గాలి అలల పైన తేలివచ్చి మనసులో తిష్ట వేసుకుంటుంది. ఇక అప్పట్నుండీ ఆ రోజంతా మనసులో, మెదల్లో, సుళ్ళు తిరుగుతూ ఆ పాటే. అయినా పువ్వులు, పాటలు , పిల్లలు, నవ్వులు లేకపోయాక ఈ ప్రపంచముండీ ఏం లాభం?  అలాంటి ప్రపంచంలో బ్రతికుండీ ఏం భాగ్యం ? కాదంటారా ... 

ఇంతకీ ఈ రోజు నేను పలవరిస్తోన్న పాట " కభీ తన్హాయియోం మే యూ హమారీ యాద్ ఆయేగీ". 

ముబారక్ బేగం గొంతు లో ఈ పాట, మీ మనసులో మరుగున పడ్డ జ్ఞాపకాలేవో తట్టి లేపకపోతే, మీ మనసెక్కడుందో వెతుక్కోండి


Tuesday, February 25, 2014

మానవత్వం అంటే ?????

మానవత్వం అంటే ఇదేనా ? 
 
పక్కన ఉన్న మనిషి కష్టాన్ని గమనించడం, మనం  కాస్త ఇబ్బందే పడినా మనకంటే బలహీనులకు ఆసరా ఇవ్వడం, ఇంతకు మించిన నిర్వచనం మానవత్వానికి ఉందా? 


కష్టాన్ని , కన్నీళ్ళని అర్థం చేసుకోడానికి భాష అక్కర్లేదు , మనసుంటే చాలు.
 

Saturday, February 15, 2014

కొందరివి అందం కోసం పాట్లు, మరి కొందరివి...??

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు


5-6 రోజుల క్రితం "నేను హార్లిక్స్ తినను, తాగుతాను..." అనే టైటిల్ తో ఈ మధ్య ఇక్కడ చాలా పాపులర్ అవుతున్న లిక్విడ్ డైట్ గురించి టపా రాసాను. నిన్న ఆన్లైన్ పేపర్లు తిరగేస్తుంటే సాక్షి పేపర్ లో "తినదు.. తాగుతుంది" అనే ఆర్టికల్ చూసాను. 

       ఏంటా అని చూస్తే హర్యానా లోని మంజు ధారా అనే అమ్మాయి చిన్నప్పటి నుండి ఘన పదార్థం అనేది తినకుండా, కేవలం పాలు , టీ , జ్యూస్లు తీసుకుంటూ ఉందని, ఆ అమ్మాయికి అన్నవాహికలో ఉన్న సమస్య వల్ల ఏమి తిన్నా వాంతి అయిపోతుందని రాసారు. అప్పుడే అనిపించింది... 

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు అని


Saturday, February 1, 2014

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరి...

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరి...అక్కడే నిలబడిన తార

ఇదే రోజు, 11 ఏళ్ళ క్రితం, బాగా గుర్తు. స్పేస్ షటిల్ కొలంబియాకు లాంచింగ్ లోనే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని , లాండింగ్ అనుకున్న విధంగా జరక్కపోవచ్చని వార్తల్లో చెప్తూనే వున్నారు. కానీ అంత ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించగలరు? 

      ఆ ఘోర ప్రమాదంలో, ఆకాశంలో రివ్వున ఎగిరే గువ్వలాంటి పంజాబ్ అమ్మాయి, మన భూమి ఆవిష్కరించే అద్భుత వర్ణచిత్రాలు అంతరిక్షంలో కళ్ళ ముందర రూపు దాల్చుతుంటే సంబరపడిపోయి ప్రపంచంతో పంచుకున్న ఇండియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా, తాను కలలు కన్న అంతరిక్షాన్ని వదలి రాలేక ఈ గాలిలో గాలిగా కలసిపోయింది. పుట్టి, పెరిగిన భారతదేశానికి, ఉన్నత విద్యావకాశాలిచ్చిన అమెరికాకు, ఋణం సంపూర్తిగా తీర్చుకున్నారామె.  

 R.I.P. Kalpana Chawla

 kalpana chawla

Image Credit: http://www.space.com/17056-kalpana-chawla-biography.html

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరిన కల్పన ... నిశ్చలమైన  ఆశయ సాధనకు నీవొక తార్కణ

(శ్రీ శ్రీ గారి కవిత "నిప్పులు చిమ్ముకుంటూ", ఈ పోస్ట్ టైటిల్ కి ఆధారం)

Sunday, January 26, 2014

అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్

ఈ రోజు వార్తల్లో చూసాను అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్ కె. ప్రసాద్ బాబు గురించి. ప్రసాద్ బాబు గ్రే హౌన్డ్స్ సబ్-ఇన్స్పెక్టర్. మావోయిస్ట్లతో పోరాడుతూ, క్రితం సంవత్సరం ఏప్రిల్ లో, నలుగురు సహచరులని కాపాడి, ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త , ప్రసాద్ బాబు తండ్రి బాధ, మనసుని కలచి వేసింది. 


 Ashok Chakra for Andhra Pradesh's braveheart cop, who died fighting Maoists

 http://www.ndtv.com/article/india/ashok-chakra-for-andhra-pradesh-s-braveheart-cop-who-died-fighting-maoists-475651
 
   
      ఇంత చదువుకున్న, తెలివైన, ధైర్యం గల యువకుడిని కోల్పోవడం నిజంగా ఆ కుటుంబానికే కాదు,సమాజానికి కూడా పెద్ద లోటే. ఇదే సంఘటనలో మరో 9 మంది నక్సల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు  కూడా చదువు , తెలివి, ప్రాణాలను పణం పెట్టగలిగిన తెగువ కలిగిన , ప్రసాద్ బాబు లాంటి యువకులే అయ్యి ఉండవచ్చు.  కానీ వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు, వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కనీసం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆఖరి చూపు కూడా దక్కి ఉండకపోవచ్చు.

      కేవలం ఆశయాలు, లక్ష్యాలు  వేరైనందుకు, ఇరువైపులా పూడ్చుకోలేని  ప్రాణ నష్టం జరిగిపోయింది. 10 కుటుంబాలు తాము గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకులను, నవ్వులూ-ఏడుపులు కలిసి పంచుకున్న అన్న/తమ్ముళ్ళని, మనస్సుని, జీవితాన్నిపంచుకున్నసహచరులను కోల్పోయారు. కారణమేదైనా కానీ, ఈ హింస ఎప్పటికీ సమర్థనీయం కాదు. 

      సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నంత కాలం సాయుధ పోరాటాలు, వాటిని అణచి వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ఉండి తీరుతాయి అని తెలుసు. అవన్నీ ఉన్నంత కాలం ఇరుపక్షాలు ఇలాంటి సంఘటనలను collateral damage అని సమర్థించుకుంటాయి అనీ తెలుసు. అన్నీ తెలిసినా ఇలాంటి వార్త చూడగానే మనసు కదిలి వచ్చే దుఃఖం ఎందుకు ఆగదు ???

 

Saturday, January 25, 2014

వియద్గంగ - 2

ఈ కథ, డాక్టర్ కశ్యప్, మందాకిని రాక కోసం ఎదురు చూస్తుండడంతో మొదలవుతుంది. ఈ మందాకిని ఎవరంటే, కశ్యప్ ప్రాణప్రదంగా పెంచుకుని, తన ఆప్తమిత్రుడు రాజా కి ఇచ్చి పెళ్లి చేసిన, చెల్లెలు రాణి సంసారాన్ని కూలదోస్తున్న మహాతల్లి (ఆ చెల్లి మాటల్లో). ఇటువంటి పరిస్థితిలో కూడా, కశ్యప్ తన చెల్లి వైపునుండి మాత్రమే కాక, ఆ ఇంకో మనిషిని కూడా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే ఆమె వైజాగ్ కి కాంప్ కి వచ్చిందని తెలిసి, డిన్నర్ కి ఆహ్వానిస్తాడు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మందాకినిని గురించి అతను అనుకునే మాట "రాగఛ్చాయల్లో ఇమడని ఆలాపన ఆమె". 

     ఆ రోజు జరిగిన సంభాషణలో కశ్యప్ గమనించే విషయం "ఫలితం ఏదన్నా కావచ్చు... ఆమె సాన్నిధ్యం గొప్ప అనుభవం" అని. అతను భోంచేయకపోడం గమనించిన ఆమె, కారణం అడిగినప్పుడు "జీవితంలో మనకు ఇష్టమైన దాన్ని ముడుపు కట్టుకొని, మనం కోరుకున్న వ్యక్తికి మేలుగా మార్చగలం" అన్న థియరీ ని తను నమ్ముతానని, అందుకే తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు, తన ప్రాణ మిత్రుడైన రాజా హాయిగా ఉండాలని కోరుకుంటూ, తనకు చాలా ఇష్టమైన తిండిని దూరం చేసుకున్నానని చెప్తాడు. 

       ఆ ఒక్కరోజు పరిచయంలో కశ్యప్ మాటల్లో, మౌనంలో మందాకిని నేర్చుకున్న విషయాలు ఆమె , ఆమెను భూమిపై ప్రవహించే మందాకిని నుండి, ఆకాశంలో ఉండే వియద్గంగగా మారడానికి దోహదం చేస్తాయి. 

    నేను ఈ పుస్తకం మొదటిసారి చదివేటప్పటికి, ఇందులో ఉన్న మిగతా కథలు, రచయితల గురించి ఏ మాత్రం తెలీదు. కాబట్టి అన్ని కథలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చదివాను. అమ్మ ప్రతిదానికీ ఉపవాసం అంటే విసుక్కునే దాన్ని... అలా లంచాలు ఇస్తారా దేవుడి కి, మనం అన్నం మానేస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి అని. కానీ ఈ కథ చదివిన తర్వాత అర్థం అయ్యింది, మనుషులుగా మనకు అత్యంత పెద్ద బలహీనత అయిన, లేదా మనకు అతి ఇష్టమైన ఏదో ఒక విషయాన్ని, అవతల మనిషికి మంచి జరగాలని నిస్వార్థంగా త్యాగం చేస్తే , ఆ ప్రేమపూరిత చర్య ఆ మనిషి జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసి తీరుతుందని. 

      రచయిత డా. వి. ఆర్. రాసాని గారి మాటల్లో "... జీవితాన్ని జీవిస్తూ మన జీవితానికి మనమే ప్రేక్షక పాత్ర వహిస్తూ సన్నివేశాలను, ఫలితాలను, అనుభూతులను సమీక్షించుకుంటూ బ్రతకడం వలన చాలా సమస్యలకు అర్థాలు దొరుకుతాయి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ విషయాన్ని కథారూపంలో జలంధరగారు చక్కగా అందించారు."

    ఈ పుస్తకంలో మీరిదివరకే చదివి ఉండిన కథలు గాలివాన, మధుర మీనాక్షి, ఓ పువ్వు పూసింది,భగవంతం కోసం లాంటి కథలతో పాటు, అరుదైన హొగినేకల్, పెంజీకటి కవ్వల,ఒక గంట జీవితం, నా స్నేహితుడు... లాంటి మంచి కథలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఇదివరకు చదివి ఉండకపోతే ఈసారి పుస్తకాల షాప్ కి వెళ్ళినప్పుడు తప్పక తెచ్చుకోండి. మీరు డిజప్పాయింట్ అవ్వరని నా నమ్మకం. 
 
                               తాత్త్విక కథలు
                            సుభాషిణి ప్రచురణలు
                                వెల:  150/రూ . 
         దొరికే చోటు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ &  ప్రజాశక్తి బుక్ డిపో
                   
              ఇంకా ఈ పుస్తకంలో ఉన్న మిగతా కథలు... 

            






                                         
                

Friday, January 24, 2014

వియద్గంగ

నా దగ్గర ఉన్న పుస్తకాల్లో , నేను మళ్ళీ, మళ్ళీ చదివేది, దూర ప్రయాణాల్లో తప్పనిసరిగా నాతో ఉండేది , మధురాంతకం నరేంద్ర గారు సంకలనకర్తగా వెలువరించిన "తాత్త్విక కథలు" పుస్తకం. 





 
     
      "సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే "అన్నా, "ఈ సృష్టికి ఏమర్థం ? మానవునికి గమ్యమేది? ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా, లేనట్టా !" అన్నా, ఈ ప్రశ్నలన్నీ అంతర్లీనంగా కోరే సమాధానమొక్కటే... జీవిత సత్యం తెలుసుకోవడం. ఏదో ఒక సందర్భంలో జీవితం అంటే ఏమిటి అనే ఆలోచన రాని మనిషి ఉండడు. ఈ పుస్తకంలోని కథలు ఆ ప్రశ్న కి జవాబులు కాదు కానీ, కొందరు రచయితలు ఈ ప్రశ్నకు వారు అన్వేషించిన సమాధానాలు, తమ తమ దృక్పథాల్లో, కథా రూపంలో తెలుగు పాఠకులకు అందించిన కానుకలు. నరేంద్ర గారి మాటల్లోనే చెప్పాలంటే, ఈ పుస్తకంలోని కథలన్నీ "మనసునీ, జీవితాన్నీ ప్రశ్నించి జిజ్ఞాసతోనో , ఆత్మసాక్షాత్కారంతోనో ముగిసే కథలు". 

     చలం గారి "ఓ పువ్వు పూసింది", ఆర్. వసుంధరా దేవి గారి "పెంజీకటి కవ్వల", ఆర్. ఎస్. సుదర్శనం గారి "మధుర మీనాక్షి", ముళ్ళపూడి గారి "కానుక", త్రిపుర గారి "భగవంతం కోసం",  లాంటి అన్నీ మంచి కథలే వున్న ఈ సంకలనంలో, నాకు చాలా ఇష్టమైన కథ, చదివిన తర్వాత జలంధర గారి మిగిలిన రచనల గురించి ఒక క్యూరియాసిటీ ని కలిగించిన కథ "వియద్గంగ".

           (కథ గురించి నా తర్వాతి పోస్ట్ లో...)
   

Sunday, January 12, 2014

ఐతజాజ్ హసన్ బంగాష్

చాలామంది నిన్న ఐతజాజ్ గురించి వార్త చదివే వుంటారు. చదవనివారి కోసం...ఐతజాజ్ పాకిస్తాన్లోని ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని హంగు జిల్లాకు చెందిన 14 యేళ్ళ అబ్బాయి. కిందటి సోమవారం ఆ అబ్బాయి స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం లో ఉన్న సూయిసైడ్ బాంబర్ ఆ అబ్బాయిని స్కూల్ అడ్రస్స్ అడగడంతో అనుమానపడి, ఆ బాంబర్ ని రాళ్ళతో కొట్టి తరమడానికి ప్రయత్నించి, అది వీలుకాక, పెనుగులాడి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

        ఈ వార్త చదివిన దగ్గర్నుండి ఒకటే ఆలోచన. ఐతజాజ్ తనేం చేస్తున్నాడో తెలిసే చేసివుంటాడా? తెలిసి, తెలిసి ఒక టీనేజ్ లో ఉన్న అబ్బాయి, తన ప్రాణాలను అంత బేఖాతరుగా పణం పెట్టగలడా? అనుమానంతో తనతో పాటు ఉన్న స్నేహితులు దూరం జరుగుతోంటే, ఆ నిముషంలో తనేమనుకొని ఉంటాడు? తల్చుకుంటుంటే కడుపులో బాధగా ఉంది.  ఒకవేళ ఐతజాజ్ కి కనుక అనుమానం రాకపోయినా, ఆ బాంబర్ ని ఆపలేకపోయినా, ఆ స్కూల్ లోని 1000 మంది పిల్లల పరిస్థితి తల్చుకుంటేనే భయంగా ఉంది. 

        కానీ...ఐతజాజ్ వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున స్కూల్ కి వెళ్తుంటే ఏమని చెప్పి ఉంటారు? మనకులాగే...జాగ్రత్తగా వెళ్ళు, స్కూల్లో చెప్పింది శ్రద్ధగా విను అనేకదా. పొద్దున అలిగో, పోట్లాడో, నవ్వుతూనో, ఏదో కావాలి అని గొడవ చేసో వెళ్ళిన పిల్లాడు, ఇక ఎన్నటికి తిరిగిరాడని తెలిసిన క్షణాన వాళ్ళు కన్నీటి సంద్రాలైపోయి ఉంటారు కదా.

         అకాల మరణం ఎవరిదైనా బాధాకరమే. కానీ ఇలా తమ తప్పేమి లేకుండా, కొంతమంది మానవత్వం లేని మనుషుల చర్యలవల్ల ప్రాణాలు పోగట్టుకున్న పిల్లల గురించి విన్నప్పుడు, మనుషుల మధ్యే ఉన్నామా అని అనుమానం వస్తుంది.   


CNN లో ఈ వార్త: http://www.cnn.com/2014/01/11/world/asia/pakistan-boy-bravery-award/

సంక్రాంతి శుభాకాంక్షలు

ఏదైనా పండగకు "శుభాకాంక్షలు" అని రాస్తుంటే, "పాఠకులకు, ప్రచురణ కర్తలకు శుభాకాంక్షలు" అని ఈనాడూ పేపర్ లో వేసేది గుర్తు వస్తుంది. చిన్నప్పుడు "పండగ శుభాకాంక్షలు", లేదా "హాప్పీ పొంగల్" (I just hate the mass "happy..." messages in cellphones) అని ఎవరికి చెప్పినట్టు గుర్తు లేదు. ఎవరి మొహంలో చూసినా ఆ పండగ సంతోషం కనిపించేది. అది పండగకు మా ఇంటికి వచ్చే నూర్ అంకుల్ మొహంలో అయినా, రంజాన్ కి షమ్షాద్ ఆంటీ చేసే బిర్యాని, ఖీర్ తినడానికి వెళ్ళినప్పుడు నా మొహంలో అయినా...



 

Saturday, January 11, 2014

చిన్ని, చిన్ని ఆనందాలు

ఒక్కోసారి చిన్న, చిన్న విషయాలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా. నిన్న ఏదో పని మీద బయటకు వెళ్తూ, కార్ స్టార్ట్ చేయగానే రేడియో లో ఈ పాట వేసారు.






ఆ ప్రోగ్రాం "రాత్" అనే పదం వచ్చే పాటల గురించి అనుకుంటా.

మొదటి పాట అయిపోగానే ఈ పాట.



మనం యూట్యూబ్ లో నో, ఏదో ఒక వెబ్ సైట్లోనో, లేదా సీడీల్లోనో మనకు ఇష్టమైన పాటలు ఎప్పుడైనా వినవచ్చు. కానీ రేడియోలో మనకు ఇష్టమైన పాటలు వస్తే భలే ఆనందమేస్తుంది కదూ :) 

ఈ రెండు పాటలు వినగానే 90'ల్లో నేను చూసిన హైదరాబాద్ గుర్తు వస్తుంది. అప్పటికింకా పూర్తిగా మహానగరీకరణ చెందని హైదరాబాద్. ఆ గుల్ మొహర్ చెట్లు, ఆ చిన్న చిన్న గలీలు, ఇరానీ చాయ్, విజయనగర్ కాలనీ లో నేను కొన్నాళ్ళూ గడిపిన ఒక అందమైన ఇల్లు...ఓహ్. ఆ నాటి హైదరాబాద్లో ఒక ఎనిగ్మా...నఖాబ్ వేసుకున్న అమ్మాయి ముఖంలా.
ఇప్పటి హైదరాబాద్ లో అప్పటి అందమేదీ కనిపించదు, ఎందుకనో ??

Friday, January 10, 2014

కొత్త ప్రారంభం

చాన్నాళ్ళ తర్వాత ఇవ్వాళ ఎందుకో బ్లాగ్ గుర్తు వచ్చింది. కొత్త సంవత్సరంలో ఏ రిజల్యూషన్స్ చేసుకోలేదు,కాబట్టి బ్లాగ్లో అప్పుడప్పుడూ నేను చదివిన పుస్తకాల పైన, విన్న పాటలపైన, చూసిన సినిమాలపైన అభిప్రాయాలు రాద్దామని అనుకుంటున్నాను.

ముందుగా...గత రెండు సంవత్సరాలుగా మనసంతా చికాగ్గా ఉండేది. పెద్ద కష్టాలు కాదు కానీ, చిన్న చిన్న చిరాకులైతే ఉండేవి. 2013 లో ఈ చిరాకులన్నీ తీరిపోయాయి. రోజూ చూస్తూనే ఉంటాం, చుట్టూ ఉన్నవాళ్ళలో ఎంతమంది, వాళ్ళ స్వయంకృతమో, ప్రారబ్ధమో కానీ, తెలిసో/తెలియకుండానో సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుని మునిగిపోతుండడం. కొంతమంది ఆ సమస్యలనుండి బయటపడి ఒడ్డుకి చేరగలరు, కొంతమంది మధ్యలోనే ఈదడం మానేస్తారు.

అలాంటి మునిగిపోయే సుడిగుండాల్లో పడకుండా నా చేయి పట్టుకుని ఈ భవసాగరాన్ని దాటిస్తున్న భగవంతునికి మనసారా వేల, వేల కృతజ్ఞతలు. 

నాకు అతి ఇష్టమైన రెండు భక్తిగీతాలు...