Showing posts with label వార్తలు. Show all posts
Showing posts with label వార్తలు. Show all posts

Saturday, June 28, 2014

మీరేమంటారు ??

మీరేమంటారు ?

అమెరికాలో వెస్ట్ కోస్ట్ లో ఉన్నవారైనా, లేదా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాళ్ళని చూడడానికి వచ్చినా, చూసి తీరే ఒక ప్రదేశం శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్



 File:GoldenGateBridge.jpg


Image from:http://en.wikipedia.org/wiki/File:GoldenGateBridge.jpg



    కొన్నిసార్లు పొగమంచు మేలిముసుగులో ఉండి, అంతదూరం నుండి వచ్చిన వాళ్ళకి ఒక చూపైనా దక్కనీయక పంపితే... 

     మరి కొన్నిసార్లు మబ్బుల్లో తేలుతున్నట్లు కనిపించి, కిందున్న నీలి సముద్రంలోనుండి, పైనున్న నీలాకాశానికి వేసిన వంతెనలా, ఉందో లేదో తెలీని మరో లోకానికి మనల్ని తీసుకెళ్ళే దారి ఇదేనేమో అనిపిస్తుంది. 



Photograph:Fog enshrouds the Golden Gate Bridge, which spans the entrance to San Francisco Bay in California.



      బహుశా ఈ రెండో కారణం వల్లేనేమో, యేటా ఆ బ్రిడ్జ్ పైనుండి దూకి ఎందరో ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ ఆత్మహత్యలను ఆపడానికి, తమవాళ్ళని కోల్పోయిన కొంతమంది ఆ బ్రిడ్జ్ కి ఒక నెట్ ఏర్పాటు చెయ్యాలని 20-30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ప్రొద్దున న్యూస్ లో $76 మిలియన్లు ఖర్చయ్యే ఆ ప్రతిపాదనని బోర్డ్ అంగీకరించిందని చదివాను. 

http://www.sfgate.com/bayarea/article/Golden-Gate-Bridge-going-to-get-suicide-nets-5585482.php

  అది చదివిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. తమవాళ్ళని ఆత్మహత్యతో కోల్పోయిన వారి మానసిక స్థితిని అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఆ పరిస్థితి వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరి వాళ్ళకు వచ్చింది కాబట్టి. మనమేమైనా చేసి ఉండగలిగేవాళ్ళమా? లేదా వాళ్ళ మానసిక స్థితిని అంచనా వెయ్యలేక పొరపాటు చేసామా అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ వదలదు. 

      కానీ ఈ నెట్ ఏర్పాటు చెయ్యడం ఆత్మహత్యలని నిరోధించడానికి ఎలాంటి పరిష్కారమో నాకర్థం కాలేదు. 

    ఈ ప్రతిపాదనని సమర్థించే వారు,అమెరికాలోని ఏ ఇతర బ్రిడ్జ్ ల కంటే గోల్డెన్ గేట్ బ్రిడ్డ్జ్ పై ఆత్మహత్య ఎక్కువమంది చేసుకుంటారు అని స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వీలవ్వకపోతే, మరణించాలనుకునే వారు మరో దారి వెతుక్కోరనే నమ్మకమేముంది? ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నంనుండి వెనక్కి తిరిగినవారు,మళ్ళీ ఆ ప్రయత్నం చెయ్యరు అని చెప్తున్నారు. కానీ ఆ స్టాటిస్టిక్స్ ఎలా తయారు చేస్తారో నాకర్థం కాలేదు. ఎంతమంది ప్రయత్నించి వెనుతిరిగారో ఎలా తెలుస్తుంది,వాళ్ళే చెపితే తప్ప. 

   ఇలాంటి ఎన్నో వ్యతిరేకతలని పరిశీలించిన తర్వాతే ఆ ప్రతిపాదనని అంగీకరించి ఉంటారని తెలుసు. కానీ నాకు మాత్రం ఇది సబబైన నిర్ణయంలా అనిపించలేదు. 

మరి ఇది చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది ??? 



Wednesday, April 16, 2014

కొలనులో కలువనై విరిసాననా,ఓ నాన్నా

కొలనులో కలువనై విరిసాననా, ఓ నాన్నా


ఇవాళ్టి పేపర్లో చూసే ఉంటారు... జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా "నా బంగారు తల్లి" అనే చిత్రాన్ని ఎంపిక చేసారు. అసలు ఎప్పుడూ పేరు కూడా వినలేదే అని గూగుల్ చేస్తే యూట్యూబ్ లో శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట కనపడింది. 



 

   ట్రైలర్ చూస్తుంటే కాస్తా "మహానది" సినిమాలోలా కూతురు అనుకోని విషవలయంలో చిక్కుకొని, బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడితే, సర్వ శక్తులు ఒడ్డి కాపాడుకునే నాన్న కథ అనిపించింది. కానీ అంత ముఖ్యమైన నాన్న కారెక్టర్ కి మలయాళం యాక్టర్ సిద్దిఖ్ ని ఎందుకు తీసుకున్నారు అనుకున్నా.కింద ఉన్న బ్లాగ్ పోస్ట్ చదివాక అర్థమైంది, ఈ సినిమా మలయాళం, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి నిర్మించారని.  

అదే సినిమానుండి ఇంకో పాట... 





   ఉమెన్ అండ్ గర్ల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆపడానికి "ప్రజ్వల" ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ప్రయత్నానికే తన జీవితాన్ని అంకితం చేసిన సునీత కృష్ణన్ గారు ప్రొడ్యూస్ చేసారు అని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇంకాస్తా పెరిగింది. ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో ఆవిడ పడ్డ కష్టాల గురించి ఆమె మాటల్లోనే ఇక్కడ చదవండి.  

http://sunithakrishnan.blogspot.com/

Saturday, April 5, 2014

మంచు పైన మెరుపు తీగ

మంచు పై మెరుపు తీ 
సోచీ వింటర్ ఒలంపిక్స్ చూసారా? మీరు చూసినా, చూడకపోయినా, ఈ ఫిగర్ స్కేటర్ గురించైతే వినే ఉంటారు. ఆ గేమ్స్ లో రెండు కాంపిటీషన్లలో పాల్గొని, మూడో ఈవెంట్లో పాల్గొనబోతూ లాస్ట్ మినిట్లో నేను రిటైర్ అవుతున్నా అని చెప్పి, వార్తల్లో ప్రముఖంగా నిలచిన ఫిగర్ స్కేటర్ ఎవ్గీనీ ప్లుషేంకో గుర్తున్నాడా ? 

తన గురించి చదువుతుంటే, తన పట్టుదల, తన కోచ్ పైన తనకున్న గౌరవం, దేశం పైన ప్రేమ...భలే నచ్చేసాడు.




 (14 యేళ్ళ వయసులో యంగెస్ట్ ఎవర్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్ పెర్ఫార్మన్స్)

ప్లుషేంకో 11 యేళ్ళ వయసులో కోచ్ మిషిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోడం మొదలెట్టాడు. తనతో పాటూ అదే కోచ్ దగ్గర ట్రైన్ అవుతూ, మధ్యలో వేరే కోచ్ దగ్గరకి వెళ్ళిపోయిన అలెక్సీ యాగుడిన్ తో తనకు బద్ధ విరోధముండేది. అలెక్సీ రిటైర్ అయ్యేవరకు ఆ శతృత్వం అలాగే కొనసాగింది. ఎన్నో ఛాంపియన్ షిప్స్ గెలుచుకున్న అలెక్సీ , ప్లుషేంకో కారణంగా, రష్యన్ నేషనల్ ఛాంపియన్ షిప్ మాత్రం ఒక్కసారి కూడా సంపాదించలేకపోయాడు. 

 2006 లో తను బ్రేక్ తీసుకున్నప్పుడు, తర్వాత సంవత్సరం (2007) వరల్డ్ చాంపియన్ షిప్ లో రష్యా పెర్ఫార్మెన్స్ చూసి బాధపడి, రాబోయే 2010 ఒలంపిక్స్ లో మళ్ళీ రష్యా ని ఛాంపియన్ గా నిలబెట్టాలనుకున్నాడు. 



పట్టుదలతో తన ట్రైనింగ్ మళ్ళీ మొదలుపెట్టి, వాంకోవర్  ఒలంపిక్స్ లో తన షార్ట్ ప్రోగ్రాం పెర్ఫార్మెన్స్ స్కోర్ తో అప్పటిదాకా ఉన్న రికార్డ్ బ్రేక్ చేసాడు. కానీ గాయాల కారణంగా 2010 వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనలేకపోయాడు. అదే సంవత్సరం తను స్కేటింగ్ ఎక్జిబిషన్స్లో అనుమతి లేకుండా పాల్గొనడం వల్ల ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ నిషేధానికి గురయ్యాడు. కానీ అదే సంస్థ తను తిరిగి 2014 ఒలంపిక్స్ లో పాల్గొనడానికి అనుమతి కోరినప్పుడు, ఏకగ్రీవంగా అంగీకరించింది. 


  
సోచీ ఒలంపిక్స్ లో రష్యా కి మొదటి గోల్డ్ మెడల్ (టీమ్) సాధించి, తన బాక్ ఇంజ్యురీ కారణంగా మిగిలిన పోటీలనుండి తప్పుకొని రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.  



కానీ తనని 2018 వింటర్ ఒలంపిక్స్ లో మళ్ళీ చూస్తే, ఏ మాత్రం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే తన సంకల్ప బలం అలాంటిది కాబట్టి... అతను ఇప్పటికెన్నో సార్లు పడి, లేచిన కడలి తరంగం కాబట్టి. 
   

(దొంగలు పడ్డ ఆరు నెలలకు సామెతలాగా ఎప్పుడో ముగిసిపోయిన వింటర్ ఒలంపిక్స్ కి సంబంధించిన పోస్ట్ ఇప్పుడేంటి అనుకోకండి. ఇది అప్పట్నుండి నా డ్రాఫ్ట్స్ లో మూలుగుతూనే ఉంది.)

Saturday, February 15, 2014

కొందరివి అందం కోసం పాట్లు, మరి కొందరివి...??

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు


5-6 రోజుల క్రితం "నేను హార్లిక్స్ తినను, తాగుతాను..." అనే టైటిల్ తో ఈ మధ్య ఇక్కడ చాలా పాపులర్ అవుతున్న లిక్విడ్ డైట్ గురించి టపా రాసాను. నిన్న ఆన్లైన్ పేపర్లు తిరగేస్తుంటే సాక్షి పేపర్ లో "తినదు.. తాగుతుంది" అనే ఆర్టికల్ చూసాను. 

       ఏంటా అని చూస్తే హర్యానా లోని మంజు ధారా అనే అమ్మాయి చిన్నప్పటి నుండి ఘన పదార్థం అనేది తినకుండా, కేవలం పాలు , టీ , జ్యూస్లు తీసుకుంటూ ఉందని, ఆ అమ్మాయికి అన్నవాహికలో ఉన్న సమస్య వల్ల ఏమి తిన్నా వాంతి అయిపోతుందని రాసారు. అప్పుడే అనిపించింది... 

కొందరివి అందం కోసం పాట్లు... మరి కొందరివి బ్రతకడానికి అగచాట్లు అని


Sunday, January 26, 2014

అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్

ఈ రోజు వార్తల్లో చూసాను అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్ కె. ప్రసాద్ బాబు గురించి. ప్రసాద్ బాబు గ్రే హౌన్డ్స్ సబ్-ఇన్స్పెక్టర్. మావోయిస్ట్లతో పోరాడుతూ, క్రితం సంవత్సరం ఏప్రిల్ లో, నలుగురు సహచరులని కాపాడి, ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త , ప్రసాద్ బాబు తండ్రి బాధ, మనసుని కలచి వేసింది. 


 Ashok Chakra for Andhra Pradesh's braveheart cop, who died fighting Maoists

 http://www.ndtv.com/article/india/ashok-chakra-for-andhra-pradesh-s-braveheart-cop-who-died-fighting-maoists-475651
 
   
      ఇంత చదువుకున్న, తెలివైన, ధైర్యం గల యువకుడిని కోల్పోవడం నిజంగా ఆ కుటుంబానికే కాదు,సమాజానికి కూడా పెద్ద లోటే. ఇదే సంఘటనలో మరో 9 మంది నక్సల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు  కూడా చదువు , తెలివి, ప్రాణాలను పణం పెట్టగలిగిన తెగువ కలిగిన , ప్రసాద్ బాబు లాంటి యువకులే అయ్యి ఉండవచ్చు.  కానీ వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు, వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కనీసం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆఖరి చూపు కూడా దక్కి ఉండకపోవచ్చు.

      కేవలం ఆశయాలు, లక్ష్యాలు  వేరైనందుకు, ఇరువైపులా పూడ్చుకోలేని  ప్రాణ నష్టం జరిగిపోయింది. 10 కుటుంబాలు తాము గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకులను, నవ్వులూ-ఏడుపులు కలిసి పంచుకున్న అన్న/తమ్ముళ్ళని, మనస్సుని, జీవితాన్నిపంచుకున్నసహచరులను కోల్పోయారు. కారణమేదైనా కానీ, ఈ హింస ఎప్పటికీ సమర్థనీయం కాదు. 

      సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నంత కాలం సాయుధ పోరాటాలు, వాటిని అణచి వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ఉండి తీరుతాయి అని తెలుసు. అవన్నీ ఉన్నంత కాలం ఇరుపక్షాలు ఇలాంటి సంఘటనలను collateral damage అని సమర్థించుకుంటాయి అనీ తెలుసు. అన్నీ తెలిసినా ఇలాంటి వార్త చూడగానే మనసు కదిలి వచ్చే దుఃఖం ఎందుకు ఆగదు ???

 

Tuesday, January 21, 2014

నాగేశ్వర రావు గారు ఇక లేరు

నాగేశ్వర రావు గారు ఇక లేరు... ఇప్పుడే ఈనాడు లో ఈ వార్త చూసాను. ఆయనది పెద్ద వయసే, ఆరోగ్యం కూడా బాగా లేదని ఈ మధ్య వింటూనే ఉన్నాము. అయినా ఆ మాట చదవగానే మనసులో బాధ... చిన్నప్పటినుండి తెలిసిన వారెవరో వెళ్లిపోయినట్లు. చిన్నప్పుడు నేను ఎన్టీయార్ గారి వీరాభిమానిని. అందుకని ఎవరైనా ఏఎన్నార్ గారి ఫాన్స్ అంటే ఓ...వెక్కిరించేదాన్ని. అందుకే ఈరోజు ఈ బాధ నాకే విచిత్రంగా అనిపిస్తోంది. ఏమైతేనేం తెలుగు సినిమాలో ఒక శకం సగం ఎన్టీయార్ గారి మరణం తో ముగిసిపోతే, మిగిలిన సగం ఇవాళ ముగిసిపోయింది. 

        ఆయన నాస్తికులని తెలుసు. కానీ నేను నమ్మే భద్రగిరి రామయ్య ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. 



Friday, January 17, 2014

సుచిత్రా సేన్

సుచిత్రా సేన్ ని నేను మొదటగా చూసింది టివిలో వచ్చిన ఆంధీ సినిమాలో . అప్పటికి సంజీవ్ కుమార్ లేకపోయినా, ఆయన గురించి విన్న విషయాల వల్ల ఆయన అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకని ఆ సినిమాలో మొత్తం ఫోకస్ అంతా ఆయన పైనే. సుచిత్రా సేన్ చాలా అందగత్తె అని విని, అంత అందంగా ఏమీ లేదే అనుకోడం మాత్రం గుర్తు. 

        తర్వాత ఎప్పుడో నాకెంతో ఇష్టమైన గుల్జార్ "తుమ్  పుకార్  లో", 
"హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోం కి మెహక్ తీ ఖుష్బూ" పాటలు  ఉన్న ఖామోషి కి మాతృక అని విని, సుచిత్రా సేన్ నటించిన బెంగాలీ సినిమా "దీప్ జ్వలే జాయ్ " లో పాటలు చూసాను.అచ్చు మూన్ మూన్ సేన్ లాగానే అనిపించింది ఆ పాటలు చూస్తుంటే. 

    ఆ బెంగాలీ సినిమాలోని ఈ పాట 




ఈ పాట ఇంకో హిందీ సినిమాలో వుంది. అది ఏ పాటో తెలుసా ?

ఆంధీ సినిమా చూసినా చూడకపోయినా, ఈ పాట వినని సినీ ప్రేక్షకులు ఉండరని నా నమ్మకం. సుచిత్రా సేన్ తో పాటు హరీభాయి ని కూడా చూసేయండి. 




Sunday, January 12, 2014

ఐతజాజ్ హసన్ బంగాష్

చాలామంది నిన్న ఐతజాజ్ గురించి వార్త చదివే వుంటారు. చదవనివారి కోసం...ఐతజాజ్ పాకిస్తాన్లోని ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని హంగు జిల్లాకు చెందిన 14 యేళ్ళ అబ్బాయి. కిందటి సోమవారం ఆ అబ్బాయి స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం లో ఉన్న సూయిసైడ్ బాంబర్ ఆ అబ్బాయిని స్కూల్ అడ్రస్స్ అడగడంతో అనుమానపడి, ఆ బాంబర్ ని రాళ్ళతో కొట్టి తరమడానికి ప్రయత్నించి, అది వీలుకాక, పెనుగులాడి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

        ఈ వార్త చదివిన దగ్గర్నుండి ఒకటే ఆలోచన. ఐతజాజ్ తనేం చేస్తున్నాడో తెలిసే చేసివుంటాడా? తెలిసి, తెలిసి ఒక టీనేజ్ లో ఉన్న అబ్బాయి, తన ప్రాణాలను అంత బేఖాతరుగా పణం పెట్టగలడా? అనుమానంతో తనతో పాటు ఉన్న స్నేహితులు దూరం జరుగుతోంటే, ఆ నిముషంలో తనేమనుకొని ఉంటాడు? తల్చుకుంటుంటే కడుపులో బాధగా ఉంది.  ఒకవేళ ఐతజాజ్ కి కనుక అనుమానం రాకపోయినా, ఆ బాంబర్ ని ఆపలేకపోయినా, ఆ స్కూల్ లోని 1000 మంది పిల్లల పరిస్థితి తల్చుకుంటేనే భయంగా ఉంది. 

        కానీ...ఐతజాజ్ వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున స్కూల్ కి వెళ్తుంటే ఏమని చెప్పి ఉంటారు? మనకులాగే...జాగ్రత్తగా వెళ్ళు, స్కూల్లో చెప్పింది శ్రద్ధగా విను అనేకదా. పొద్దున అలిగో, పోట్లాడో, నవ్వుతూనో, ఏదో కావాలి అని గొడవ చేసో వెళ్ళిన పిల్లాడు, ఇక ఎన్నటికి తిరిగిరాడని తెలిసిన క్షణాన వాళ్ళు కన్నీటి సంద్రాలైపోయి ఉంటారు కదా.

         అకాల మరణం ఎవరిదైనా బాధాకరమే. కానీ ఇలా తమ తప్పేమి లేకుండా, కొంతమంది మానవత్వం లేని మనుషుల చర్యలవల్ల ప్రాణాలు పోగట్టుకున్న పిల్లల గురించి విన్నప్పుడు, మనుషుల మధ్యే ఉన్నామా అని అనుమానం వస్తుంది.   


CNN లో ఈ వార్త: http://www.cnn.com/2014/01/11/world/asia/pakistan-boy-bravery-award/