Wednesday, February 5, 2014

మౌనవ్రతం

కినిగె పత్రిక వారి గత నెల కవితానువాదాల పోటీలో రష్యన్ కవి ఫ్యోదోర్ చూచెవ్ రాసిన “Silentium” కవితకు, నేను పంపిన అనువాదం. అఫ్కోర్స్ , సెలెక్ట్ కాలేదనుకోండి :)  

      కానీ కాకి పిల్ల కాకికి ముద్దు కదా. పైగా అసలు కవితలు అర్థమే కాని నేను , అతి కష్టపడి చేసిన అనువాదం. అందుకని ఇక్కడ పోస్ట్ చేసుకుంటున్నా. ఎంపిక చేసిన వాటిలో "విజయాదిత్య" గారి అనువాదం నచ్చింది. మరి మీకు ????

 మౌనవ్రతం 


మాటల్లో పొదగక, మనసు మారుమూలల్లో దాచి ఉంచుకో,
నువ్వు కనే స్వప్నాలని, నీ మనసుని కదిపే కాసిన్ని భావాలని
నిశి రాతిరి కప్పివేయక మునుపు మిడిసిపడే స్ఫటికపు ఆకాశంలో,
మిణుగురు పురుగులవలే ఎగిరే తారల్లా, వాటిని స్వేచ్ఛగా వదిలేసి…
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ ఆనంద వాహినిలో తేలియాడు

మది కదలికలు పట్టుకోగలవారెవ్వరు? మరొకరి మనో యవనికను కనే వారెవ్వరు?
ప్రాణానికి ప్రాణమైనా, నీలోని స్పందనలకి కారణమేదో అతడు తెలియరాగలడా?
పెదవంచుల తొణికిసలాడిన మది తలపు వితథమే కాదా
మధించిన తలిపెర కలుషితమే కాదా...
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ అమృత వాహినిలో ఓలలాడు

ఏకాంతంలో అంతర్ముఖుడవై ఉజ్జీవిస్తే
నీ హృత్కమలములో పెరిగిన జగతిని కాంచలేవా 
ఒక చిన్ని కిరణానికే చెదిరిపోయే నీహారికలాంటి తరోహితమైన ఊహల గారడీ
జీవితపు రణగొన ధ్వనులలో క్రుంగిపోయే మనోసంగీతం...
ఒక్క మాటైనా ఉచ్ఛరించక, ఆ స్వర గాన వాహినిని ఆలింగనము చేసుకో 

No comments:

Post a Comment